Mana Enadu: హైడ్రా.. తెలుగు రాష్ట్రాల్లోని కొందరికి ఇప్పుడు ఈ పేరు వింటేనే దడ పుడుతోంది. ఎప్పుడు ఎవరిపై హైడ్రా పిడుగు పడుతుందోనని కంగారెత్తున్నారు పలువురు. అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి పాలిట హైడ్రా ఓ ఉప్పెనలా మారింది. ఇప్పటికే తెలంగాణలోని హైదరాబాద్ మహానగరంలో పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో కబ్జాదారుల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొందరు హైడ్రా నుంచి నోటీసులు అందక ముందే కోర్టులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా గత నెల రోజులుగా హైదరాబాద్‌లో కూలగొట్టిన అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించింది.
ఇప్పటి వరకు మహానగరంలోని 18 చోట్ల హైడ్రా కూల్చివేతలు చేపట్టినట్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి నివేదిక అందించింది. దాదాపు 43 ఎకరాలను కబ్జా కోరల నుంచి రక్షించింది. అమీర్ పేట్, బంజారహిల్స్, లోటస్ పాండ్, ఎమ్మెల్యే కాలనీ, గాజులరామారం, మన్సూరాబాద్, నందినగర్ తదితర ప్రాంతాల్లో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇందులో ప్రముఖులు రత్నాకర్ రాజు, భాస్కర్ రావు, పల్లంరాజు, సునీల్ రెడ్డి, అనుపమ కట్టడాలు సహా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూడా హైడ్రా నేలమట్టం చేసినట్లు తన నివేదికలో పేర్కొంది.
కూల్చివేతల లిస్ట్ ఇదే..
నందినగర్‌లో ఎకరం స్థలం, లోటస్ పాండ్‌లో కాంపౌండ్ వాల్, మనసురాబాద్‌లో సహారా ఎస్టేట్లో కబ్జాలు కూల్చివేసింది. దీంతోపాటు ఎమ్మెల్యే కాలనీలో పార్కు స్థలం, మిథాలీ నగర్‌లో పార్కు స్థలం, బీజేఆర్ నగర్‌లో నాలా స్థలం, గాజులరామారంలో రెండంతస్తుల భవనం కూల్చివేసింది. అలాగే ప్రగతినగర్ ఎర్రకుంటలో నిర్మించిన అక్రమ నిర్మాణాలు, గండిపేట చెరువులో నిర్మించిన ఫామ్ హౌస్‌లు నేలమట్టం చేసింది. తాజాగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను గంటల వ్యవధిలో హైడ్రా కూల్చివేసింది. ఆయా అక్రమ నిర్మాణాల్లో ప్రముఖులైన ఎంఐఎం ఎమ్మెల్యే మోబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, టీటీడీ మాజీ సభ్యుడు, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, మంతిని బీజేపీ నేత సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపమ, హీరో నాగార్జున, ఎమ్మెల్యే దానం నాగేందర్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఇదిలా ఉండగా.. అక్రమ నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పష్టం చేశారు.