ManaEnadu:వర్షాకాలం (Monsoon) వచ్చేసింది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలు వరదలతో పాటు సీజనల్ వ్యాధులను కూడా తెచ్చేశాయి. ఇప్పటికే డెంగీ, టైఫాయిడ్, మలేరియా, గన్యా వంటి వ్యాధులతో ప్రజలు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సీజన్‌లో నీరు, ఆహారం వల్ల వ్యాధులు ఎక్కువగా సంక్రమిస్తాయి. ముఖ్యంగా ఫుడ్ పాయిజన్ (Food Poison) వంటి సమస్యలు ఈ సీజన్‌లో ఎక్కువ వస్తుంటాయి.
వీటికి దూరంగా ఉండాల్సిందే
అందువల్ల ఆరోగ్యకరమైన ఆహారాన్ని, వీలైనంత వరకు వేడి వేడి ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వానా కాలంలో కొన్ని కూరగాయల (Vegetables)కు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఈ కాలంలో ముఖ్యంగా ఆకుకూరలను కాస్త దూరం పెట్టడమే ఉత్తమమని సూచిస్తున్నారు. తేమ కీటకాలు, బ్యాక్టీరియా వంటివి కొన్ని కూరగాయలపై తిష్ట వేసుకుని కూర్చుంటాయని అందుకే వాటికి దూరంగా ఉండాలంటున్నారు. మరి ఆ కూరగాయలేంటంటే?
ఆకుకూరలు తినొద్దట
తోటకూర, పాలకూర, గోంగూరు, బచ్చలి కూర వంటి ఆకుకూరల (Leafy Vegetables)ను ఈ సీజన్‌లో తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల వర్షాకాలంలో వాటిలో బ్యాక్టీరియా పెరిగిపోయి వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.
ఇవి కూడా తినొద్దు
క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలీ (Brocoli), బ్రెసెల్స్ వంటి కూరగాయలను దూరంగా ఉంచాల్సిందే. క్యారెట్, ముల్లంగి, బీట్ రూట్, టర్నిప్ వంటి వాటిని తినకకూడదు. పోషకాల గనిగా చెప్పుకునే పుట్టగొడుగులు కూడా ఈ సీజన్‌లో టచ్ చేయొద్దట. వర్షాకాలంలో ఇందులో ఫామ్ అయ్యే బ్యాక్టీరియా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందట. ఇక కూరల్లో రాజు అదేనండి మన వంకాయ(Brinjal)ను కూడా వర్షాకాలంలో తినకపోవడమే మంచిదట. ఈ వానాకాలం అయిపోయే వరకు కాస్త ఈ కూరగాయలను దూరం పెడితే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక : ఇక్కడ అందించిన ఆరోగ్య సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా వైద్యుల సలహా తప్పనిసరి.