ManaEnadu:మీ ఇంట్లో వృద్ధులున్నారా? వారికి ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోలేదా? అయితే మీలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 70ఏళ్లు పైబడిన వారికి వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవత్ వెల్లడించారు. దీంతో దేశంలో 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం కలుగనుంది. ఈ పథకం ద్వారా 70ఏళ్లు పైబడిన వారు వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు.
ఆయుష్మాన్ భారత్ పథకాన్ని 2018లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హులకు ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ కార్డు చూపించి రూ.5లక్షల వరకూ వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చు. ఇప్పటికే ఈ పథకం పరిధిలోకి వచ్చే వారికి వారి కుటుంబాల్లోని సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఏడాదికి రూ.5 లక్షల అదనపు బీమా వస్తుంది.
పేదలకు ఉచితంగా చికిత్స అందించడంతో పాటు వైద్య సేవలకు మద్దతిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన బీమా పథకమే ఈఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆరోగ్య భరోసా పథకం. కుటుంబ సభ్యుల వయస్సుతో సంబంధం లేకుండా 12.34 కోట్ల కుటుంబాలకు చెందిన 55 కోట్ల మందికి ఈ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తుంది. ఈ పథకం పరిధిలో 7.37 కోట్ల ఆసుపత్రులు ఉన్నాయి. కాగా లబ్ధిదారుల్లో 49 శాతం మంది మహిళలే ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకు ఈ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ద్వారా ప్రజలకు రూ .లక్ష కోట్లకు పైగా ప్రయోజనం లభించింది.