ManaEnadu:రోడ్డు ప్రమాదాలు, ఆత్మహత్యలు (Suicides), హత్యలు.. ఇలా వివిధ రకాలుగా రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదంతా విధి అని వారి ఆత్మీయులు గుండెలవిసేలా రోదించి వాళ్ల ఆయువు అంతేనేమోనని సరిపెట్టుకుంటున్నారు. కానీ ప్రాణం నిలిచే అవకాశం ఉన్నా.. ప్రాణాన్ని కాపాడే ఛాన్స్ ఉన్నా.. కొందరు వైద్యుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో (Govt Hospitals) వసతుల లేమి, సర్కార్ వైఫల్యం వల్ల నిత్యం పదుల సంఖ్యలో రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యులు తమ ప్రాణాలు నిలబెడతారని, ఆస్పత్రులు తిరిగి ఊపిరూలూదుతాయని భావించి వస్తున్న వారు నిర్జీవంగా నేలకొరగాల్సిన దుస్థితి నెలకొంటోంది. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి (NIMS Hospital) గురించి అందరికీ తెలిసిందే. ఇక్కడికి వేలాది మంది నిత్యం వైద్యం కోసం వస్తుంటారు. అయితే అరకొర వసతుల వల్ల రోగులు, వారితో వచ్చిన సహాయకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా అత్యవసర (Emergency) చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ మహిళ.. బెడ్లు లేకపోవడంతో చికిత్స పొందకుండానే మరణించిన ఘటన ఇక్కడ చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం, ఆస్పత్రిలో వసతుల లేమి వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా గొండ్రియాలకు చెందిన నెల్లూరి సైదమ్మ(50) అనే మహిళ గుండె సంబంధిత వ్యాధి(Heart Patient)తో బాధపడుతోంది. బుధవారం రోజున ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటీలేటర్ పై అత్యవసర చికిత్స కోసం ఆమెను అంబులెన్సులో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే ఆస్పత్రిలో సమయానికి బెడ్లు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పడంతో రెండు గంటలకు పైగా అంబులెన్సులోనే చికిత్స చేయకుండా ఉంచారు.
ఆ తర్వాత ఆమెను ఓ ప్రవైట్ ఆస్పత్రిలో చేర్పించిన పది నిమిషాలకే సైదమ్మ ప్రాణాలు విడిచింది. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే సైదమ్మ మరణించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వెంటీలేటర్ పై వచ్చే రోగులను అడ్మిట్ తీసుకోవద్దని నిమ్స్ ఉన్నతాధికారులు స్పష్టమైన అదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
అయితే ఇలాంటి పరిస్థితి కేవలం సైదమ్మకే కాదు నిత్యం ఎంతో మంది రోగులు ఇలాంటి కారణాలతో మరణిస్తున్నారు. సమయానికి ఆస్పత్రి చేరుకోలేక మరణించడం ఒకెత్తయితే.. ఆస్పత్రికి వచ్చినా సమయానికి వైద్యం (Treatment) అందక మరణించడం బాధాకరం. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను తలపిస్తున్న ప్రభుత్వ దవాఖానాలు, కార్పొరేట్ వైద్యం (Corporate Hospitals) అందిస్తున్న బస్తీ దవాఖానాలు అని రోజూ వార్తలు వస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం కనీస వైద్యం లేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.