Mana Enadu : హైడ్రా (Hydra).. ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఇదే మాట వినిపిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు అందరి గుండెల్లో హైడ్రా హడల్ పుట్టిస్తోంది. లేక్ వ్యూ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఈ పేర్లు వింటుంటే చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. చెరువులు, కుంటలు కబ్జా చేసి భవనాలు కట్టుకున్న వారిపై హైడ్రా (Hydra Demolitions) ఉక్కుపాదం మోపుతోంది. అయితే అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నా.. అన్ని అనుమతులు తీసుకున్నా.. తమ ఇళ్లను కూల్చేస్తున్నారని కొంతమంది సామాన్యులు ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైడ్రా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ప్రతిపక్షాలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ (BRS On Hydra) హైడ్రాపై నిప్పులు చెరుగుతోంది. సీఎం సోదరుడికి ఒక రూల్.. సామాన్యుడికి ఇంకో రూల్ అంటూ మండిపడుతోంది. ఇక తాజాగా హైడ్రాపై బీజేపీ నేతలు కూడా గళమెత్తారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తాజాగా హైడ్రాపై స్పందించారు. హైడ్రా తీరుతో ప్రభుత్వ తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు.
గతంలో అయ్యప్ప సొసైటీ కూల్చివేత పేరుతో బీఆర్ఎస్ పార్టీ వసూళ్లు చేసిందని .. ఇప్పుడు హైడ్రా పేరుతో కాంగ్రెస్ వసూళ్లకు తెరదీస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. పేదల ఇళ్లను కూలిస్తే హైడ్రాను అడ్డుకుంటామని తెలిపారు. ప్రజలకు బీజేపీ (BJP Hydra) ఆయుధం కాబోతోందన్న ఆయన.. వాళ్ల కోసం తమ ప్రాణాలను అడ్డుపెడతామని వెల్లడించారు. తమ ప్రాణాలు తీశాకే.. ఇళ్ల కూల్చివేతలకు వెళ్లాలని.. హైడ్రా దాడులపై బీజేపీ సింగిల్‌గానే ఉద్యమిస్తుందని బండి సంజయ్ తేల్చి చెప్పారు.
“కాళేశ్వరం పేరుతో బీఆర్ఎస్ రూ.లక్ష కోట్ల అవినీతి చేసింది. మూసీ సుందరీకరణ (Musi Beautification) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి తెరతీసింది. హైడ్రా తీరుతో ప్రజలు అసహ్యించుకుంటున్నారు.” అని కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బండి సంజయ్ అన్నారు.